*సీసీ రహదారి నిర్మాణంలో నిర్లక్ష్యం**కొత్త రహదారిపై భారీ వాహనాల రాకపోకలు**కుంగిపోతున్న సిసి రహదారి**పట్టించుకోని అధికార* *యంత్రాంగం**ఆందోళన వ్యక్తం చేస్తున్న* *స్థానికులు*తాళ్లరేవు మండలం, మహి న్యూస్, డిసెంబర్ 13..కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న సిసి రహదారి నిర్మాణం పై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఉండాల్సిన రహదారి నిర్మాణంలో అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళ్ళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం ప్రధాన రహదారిని రూ. 1.61 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి216 నుంచి స్థానిక అంబేద్కర్ నగర్ వరకు సీసీ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయా పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. అయితే యానాం-ద్రాక్షారామ రహదారిలో ఉన్న ఈ సీసీ రహదారిని అభివృద్ధి చేసేందుకు రహదారిని పూర్తిగా మూసివేయడంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహన చోదకులు ఆనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాత్రి వేళల్లో మాత్రం భారీ వాహనాలు సంచరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భారీ వాహనాలు సీసీ రహదారిపై సంచరించడాన్ని పలువురు మొబైల్లో లో చిత్రీకరించారు. సీసీ రహదారిని వేసి రెండు రోజులైనా కాకుండా భారీ వాహనాలను ఎలా అనుమతిస్తున్నారంటూ అధికారులపై మండి పడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన సీసీ రహదారిపై బారీ వాహనాలు తిరగడం వల్ల రహదారి నాణ్యత దెబ్బతింటుందని. ఇప్పటికే కొన్నిచోట్ల రహదారి కిందికి దిగబడిపోయిందని ఆరోపిస్తున్నారు. రహదారి మూసివేసి తాము అనేక ఇక్కట్లు పడుతుంటే పలువురు ఇష్టారాజ్యంగా కొత్త రహదారిపై వాహనాలతో వెళ్లడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సీసీ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు, భద్రతా ప్రమాణాలు కూడా పాటించాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు పూర్తి పర్యవేక్షణతో పనులు చేపట్టాలని, సీసీ రహదారి పూర్తిగా పటిష్టం అయ్యేవరకు ఎటువంటి వాహనాలను అనుమతించరాదని కోరుతున్నారు.


