- తాళ్లరేవు, మహి న్యూస్, డిసెంబర్ 31
అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ చెకోపోస్టులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. తాళ్లరేవు మండల సరిహద్దులో ఉన్న కేంద్రపాలితప్రాంతమైన యానాం నుంచి మద్యం ఆంధ్రాప్రాంతానికి అక్రమ తరలింపును నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాలైన నీలపల్లి, సుంకరపాలెం గ్రామాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసారు. నీలపల్లి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా చెక్పోస్టు ఉండి మంచి పేరుగాంచింది. యానాం నుంచి నీలపల్లి దాటాలంటే అక్రమార్కులు భయబ్రాంతులకు గురయ్యేవారు. అటువంటి పేరుగాంచిన చెక్పోస్టు నేడు అధ్వానంగా తయారైంది. మండలంలో జాతీయ రహదారి216 చెంతన పి.మల్లవరం వద్ద చెకోపోస్టును ఏర్పాటు చేసారు. దీంతో నీలపల్లి చెక్ పోస్ట్ నిరుపయోగంగా మారింది. అయితే ఈ చెక్ పోస్టులో నిర్వహణ లేకపోవడంతో ప్రాంగణంలో చెత్త చెదారాలు వేయడంతో ఆధ్వానంగా దర్శనమిస్తుంది. అదేవిధంగా సుంకరపాలెంలో చెక్పోస్టు ఉన్నప్పటికీ నిరంతర తనిఖీలుగాని, మద్యం ఆక్రమార్కులను పట్టుకోవడం గాని కానరావడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఉండగా జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సైతం అలంకారప్రాయంగా మారింది. పట్టుమని పదిబాటిళ్లను పట్టుకున్న దాఖలాలు కనిపించడంలేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పండుగ రోజులు కావడంతో మద్యం రవాణా అధికంగా ఉండే ప్రభుత్వం అవకాశం ఉందని నిరంతర నిఘా ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

