కోటబొమ్మాళి, మహి న్యూస్, జనవరి 17 : నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే రైల్వే హాల్టుల కోసం కృషి చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే సుదీర్ఘ కాలంగా నిరీక్షణలో ఉన్న సమస్యను కొలిక్కి తీసుకు వచ్చే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంప్రదింపులు చేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అభినందనీయమని, ఇందులో భాగంగా బ్రహ్మపురం నుంచి విశాఖ ఎక్స్ ప్రెస్ సర్వీస్ కు తిలారు వద్ద నూతన హాల్టు సాధించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. తిలారు రైల్వే స్టేషన్ వద్ద బ్రహ్మపురం నుంచి విశాఖ ఎక్స్ ప్రెస్ సర్వీస్ కు తిలారు వద్ద నూతన హాల్టును కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1996లో దివంగత నేత, అప్పటి కేంద్ర మంత్రివర్యులు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఈ ప్రాంత రైల్వే సమస్యలపై వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించ లేదు అని ఆవేదన చెందారు. రైల్యే సమస్యలపై కనీస శ్రద్ధ చూపలేదని అన్నారు. కానీ ఇప్పుడు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారన్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషను అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. ప్రధాన సమస్య అయిన అండర్ పాస్ నిర్మాణం చేపట్టి వర్షాకాలంలో తరుచూ తలెత్తుతున్న సమస్యను పరిష్కరించి నీరు నిల్వ లేకుండా చేయాలని రైల్యే అధికారులకు కోరారు. రైల్వే కనెక్టివిటీతో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. అత్యధిక శాతం మంది ప్రజలు రైల్వే ప్రజా రవాణా పైనే ఆధారపడుతున్నందున ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం స్థానిక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్రా, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి, పాల్గొన్నారు.

