- కోకో పంటకు ఆయిల్ పామ్ పంట రీతిలో గిట్టుబాటు ధర కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తాం
- నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం
- త్వరలో విజయవాడలో అంతర్జాతీయ హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సు నిర్వహిస్తాం
- ఉద్యానవన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం
ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు

ఏలూరు, మహి న్యూస్, జనవరి 30 : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. స్థానిక చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ ఫంక్షన్ హాలులో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రైతుల ప్రతీ సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర జిఎస్డిపి లో వ్యవసాయం 50 వేల కోట్ల రూపాయలు ఉంటె ఉద్యానవన శాఖ 1. 68 లక్షల కోట్లు ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, ఉద్యానవన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ అందిస్తున్నామన్నారు.

విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో పెద్దఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పధకానికి గత ప్రభుత్వం 7500 కోట్లు కేటాయించినప్పటికీ, 5 సంవత్సరాలలో కేవలం 1300 కోట్లు రూపాయలు మాత్రమే రైతులకు అందించిందన్నారు. తమ ప్రభుత్వం గత బడ్జెట్లో 300 కోట్లు కేటాయించి సంవత్సరకాలంలో 1200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పధకానికి రైతులకు అందించామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా ఉండేలా తీసుకోవలసిన చర్యలపై రైతులకు తెలియజేస్తున్నామన్నారు. దీని కారణంగా కోకో పంటకు మంచి ధర లభిస్తుందన్నారు. కోకో పంట సాగులో తక్కువ ఖర్చుతో, నాణ్యమైన పంట అధిక దిగుబడి, రైతుకు లాభసాటిగా ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. కోకో కాంక్లేవ్ సదస్సును శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కలిస్తారని, నాణ్యమైన కోకో ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ, బ్యాంకర్ల సహకారం తదితర అంశాలు కాంక్లేవ్ లో తెలియజేస్తారన్నారు.

👉 జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 44 వేల 984 ఎకరాలలో కోకో సాగవుతూ, 10 వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తితో దేశంలోనే ఏలూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లా జిడిపి వృద్ధిలో లో ఉద్యానవన పంటల పాత్ర ప్రధానమైనదన్నారు. పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా ఉండేలా తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కాలిస్తున్నామన్నారు. జిల్లాలో అదనంగా 1200 హెక్టార్ట్లలో కోకో పంట వేసేలా 15 వేల మంది రైతులకు శిక్షణ అందించామన్నారు. నాణ్యమైన కోకో గింజల సాగుపై అధ్యాయానికి జిల్లాలోని కోకో అభ్యుదయ రైతులను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపించామన్నారు. జిల్లాలో 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో భాగంగా 7 చాకొలేట్ పరిశ్రమలు డ్వాక్రా సంఘాలచే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. .
👉 ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తికి రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గత సంవత్సరం కోకో పంటకు ధర లేనప్పుడు రాష్ట్రప్రభుత్వం కిలోకి 50 రూపాయలు అందించిందన్నారు.
👉 దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు శాస్త్రవేత్తలు అందించే సూచనలతో కోకో రైతులు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన కోకో అధిక దిగుబడి సాధించాలన్నారు.
👉 చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో దేశంలో చింతలపూడి నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలుస్తుందన్నారు. విదేశాల నుండి కోకో మొక్కలు దిగుమతి చేసుకుని వినియోగిస్తే కోకో నాణ్యతనాణ్యమైన కోకో ఉత్పత్తి సాధించి, కోకో ధరలో విదేశాలతో పోటీపడవచ్చన్నారు. చాకొలేట్ ఆరోగ్యానికి మంచిదని, యూరప్ దేశాలలో సంవత్సరానికి 9 కేజీలకు పైగా చాకొలేట్ వినియోగం ఉంటె, మన దేశంలో కేవలం కేజీ మాత్రమే వినియోగిస్తున్నారన్నారు.
👉 ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ దేశంలోనే అధిక కోకో ఉత్పత్తి చేస్తున్న ఏలూరు జిల్లాలో కోకో ప్రాసెసింగ్ యూనిట్లు, చాకొలేట్ పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మన దేశంలో కోకో మొక్క 3 నుండి 4 కేజీలు కోకో గింజలు ఉత్పత్తి చేస్తుంటే, విదేశాలలో 8 కేజీల వరకు దిగుబడి వస్తుందన్నారు. నాణ్యమైన కోకో ఉత్పత్తి చేస్తే కేజీకి 150 రూపాయలకు పైగా అదనంగా ఆదాయం లభిస్తుందని, ఈ దిశగా రైతులకు అవగాహన కలిగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ కమీషనర్ కె. శ్రీనివాసులు, ఏలూరు ఉద్యానవన శాఖాధికారి సాజా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, ఉద్యానవన విభాగానికి చెందిన జాతీయ సంస్థల డైరెక్టర్లు / అధిపతులు , CPCRI, DCCD, NIFTEM-T, KAU, CAMPCO, IIHR, YSRHU పరిశోధనా సంస్థలు మరియు సెంటర్ అఫ్ ఎక్సెలెన్స్ (CoE) ప్రతినిధులు మరియు ప్రముఖ జాతీయ బ్యాంకు ప్రతినిధులు,, కోకో ప్రాసెసింగ్ పెట్టుబడి దారులు, కోకో అభ్యుదయ రైతులు, ప్రభృతులు పాల్గొన్నారు.
అనంతరం కోకో పంటలో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన చర్యలు, తదితర అంశాలపై ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ని, ఎమ్మెల్యే లు, జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ ఉన్నతాధికారులను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.

