ఆస్పత్రులు, ఇంటింటికీ వెళ్లి బాధితులకు ధైర్యం
శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బుధవారం ఉదయం విస్తృత పర్యటన చేపట్టారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొని పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దమ్మలవీధిలోని సిమ్మన హాస్పిటల్, మంగువారి తోట ప్రాంతం, అలాగే రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించి చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క రోగి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అదేవిధంగా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తూ ప్రతి వీధిని పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అవసరమైన ప్రతి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. ప్రతి వీధిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచాలని, తాగునీటి సరఫరా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.బాధితులకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా ఆస్పత్రులు, ఇంటింటికీ వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసమయంలో ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వెంటనే చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే గొండు శంకర్ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాయి. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, వార్డ్ ఇన్చార్జిలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

