సాంకేతికత వినియోగం భేష్.
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు విద్యార్థులకు వరం.
విద్యా ప్రమాణాల విషయంలో టీచర్ల కృషి అభినందనీయం.
సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు పిలుపు.
చిత్తూరు జిల్లా /బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 :
చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడేలా నిర్వహించబడుతోందని , కేంద్ర ప్రభుత్వ అధికారి మనీష్ అన్షు ప్రశంసించారు.

జిల్లాలో పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల స్థితిగతులను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలకులుగా విచ్చేసిన మనీష్ అన్షు గారు, తన పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లు స్కౌట్ విద్యార్థులు ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో ఏర్పాటుచేసిన వివిధ క్రీడా మైదానాలను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళ్యం విద్యార్థులు వాలీబాల్ తో పాటు , ఖోఖో ,త్రో బాల్ తదితర క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలలో ప్రతిభ కనబరిచిన విషయాన్ని ప్రస్తావించి అభినందించారు.
సైన్స్,కంప్యూటర్, ఒకేషనల్ ల్యాబ్ లు పరిశీలించి నిర్వహణ గురించి విద్యార్థులతో ముచ్చటించారు. మరుగుదొడ్లను, వంట గది పరిసరాలు, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, బోధన పద్ధతుల పైన ఉపాధ్యాయులతో సమీక్షించి అభినందించారు.
బంగారు పాల్యం పాఠశాలలో పిల్లల విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు, శారీరక మానసిక వికాసం తో కూడిన సమగ్ర అభివృద్ధికి అనువైన వాతావరణం ఉందన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు, అన్ని రకాల వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ, సెక్టోరియల్ అధికారులు శశిధర్ ,మధు, సుభాషిణి, గీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.

