రాజంపేట, మహిన్యూస్, పిబ్రవరి 26:
రాజంపేట మున్సిపాలిటీలో తాగునీటి నాణ్యతపై అకస్మాత్ తనిఖీలు
రాజంపేట పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ అకస్మాత్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలు నీటి సరఫరా కేంద్రాలను పరిశీలించి, తాగునీటిలో ఫ్లోరిన్ స్థాయిలను స్వయంగా పరీక్షించారు. పరీక్షల ద్వారా నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకున్నారు.
అదేవిధంగా వాటర్ సెక్షన్ సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సకాలంలో శుద్ధమైన తాగునీరు అందించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, వేసవికాలంలో నీటి కొరత లేదా నాణ్యత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నీటి శుద్ధి ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.
మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

