యానాం, మహి న్యూస్, ఫిబ్రవరి 27:
స్థానిక పీఎం జవహర్ నవోదయ విద్యాలయంలో ‘విజ్ఞాన జ్యోతి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యానాం రీజినల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార కు విద్యాలయ స్కౌట్ బ్యాండ్ ట్రూప్, సంప్రదాయ ‘పూర్ణకుంభం’తో ఘన స్వాగతం పలికారు. స్కౌట్ అండ్ గైడ్స్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన విద్యాలయ ప్రాంగణంలోని ‘రాజీవ్ స్మృతివనం’లో కొబ్బరి, మామిడి, జామ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అంకిత్ కుమార్ మాట్లాడుతూ తన స్వీయ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఐఏఎస్ వంటి ఉన్నత స్థాయి పరీక్షలకు తాను ఏ విధంగా సిద్ధమైందీ వివరిస్తూ, కఠిన శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని పేర్కొన్నారు. ఒకవేళ అపజయం ఎదురైనా కుంగిపోకుండా, దానిని విజయానికి పునాదిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం మార్కుల కోసమే కాకుండా, సబ్జెక్టుపై లోతైన అవగాహన కోసం చదవాలని, క్రమశిక్షణతోనే అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ‘ప్రశ్నించే ధోరణిని’ అలవర్చుకోవాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. చదువుతో పాటు ఇతర సహపాఠ్య కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యాలయ పూర్వ విద్యార్థి, యానాం వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జోగి రాజు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు వరమని కొనియాడారు. తన ఎదుగుదలకు ఈ విద్యాలయమే పునాది అని తెలుపుతూ, పాఠశాల అభివృద్ధికి తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ‘విజ్ఞాన జ్యోతి’ పథకం కింద ఎంపికైన విద్యార్థినులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ప్రధానాచార్యులు శ్రీ ఎస్.ఎస్. కీర్తి మాట్లాడుతూ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాలలో బాలికలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, మెటీరియల్ వంటి ప్రయోజనాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యాలయం తరఫున అతిథులను సముచితంగా సన్మానించారు. అనంతరం అతిథులు మెస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి కోఆర్డినేటర్ యు. జయప్రకాష్, ఇతర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

