- 716 జి నేషనల్ హైవే రోడ్డు బాధితుల ఆగ్రహం
పులివెందుల, మహి న్యూస్, ఫిబ్రవరి 27 :
ముద్దనూరు -గోరంట్ల వరకు వయా పులివెందుల మీద నిర్మిస్తున్న 716జి నేషనల్ హైవే రోడ్డు నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ నిమిత్తమై ఆ భూములు కోల్పోతున్న ప్రజలతో పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ వస్తారని తొలుత ప్రకటించారు. కానీ జాయిన్ కలెక్టర్ హాజరు కాలేదు. అలాగే ఈ రోడ్డు నిర్మాణాల సందర్భంగా భూములు కోల్పోతున్న చాలామందికి సమాచారమే ఇవ్వలేదు. అయితే కొంతమంది సమాచారం తెలుసుకొని సమావేశానికి హాజరయ్యారు. పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, తాసిల్దార్ లు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కీలకమైన మున్సిపల్ కమిషనర్ కూడా హాజరు కాలేదు. ఈ సమావేశానికి సంబంధిత హైవే అధికారులు కానీ ఆర్ అండ్ బి అధికారులు కానీ హాజరు కాలేదని బాధితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏదో సమావేశాన్ని నిర్వహించామని వెల్లడించేసి చకచక కొన్ని వివరాలు పేపర్ ద్వారా చదివి మమ అనిపించి వెళ్లిపోయారని బాధితులు ఆగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే 716జి నిర్మాణాల కారణంగా తమ ఇల్లు స్థలాలు, భూములు కోల్పోతున్న బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమావేశ వివరాలు ఉద్దేశాలు వివరించకుండానే అధికారులు తూతూ మంత్రంగా ఈ సమావేశాన్ని నిర్వహించారని వారు ఆగ్రహించారు. తాము తిని తినక డబ్బులు పోగు చేసుకుని ఇల్లు, స్థలాలు, భూములు కొనుగోలు చేస్తే ఇలా పూరి మధ్యలో హైవే నిర్మాణాలు చేపట్టి తమ కడుపు కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రారంభం నుంచి ఎలాంటి సమాచారాన్ని అధికారులు కానీ నేషనల్ హైవే అధికారులు కానీ ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఈ నేషనల్ హైవే నిర్మాణాన్ని తుమ్మలపల్లి నుంచి వయా జగనన్న కాలనీ మీదుగా వెళ్తే ఎవరికీ నష్టం ఉండదని అంతేకాక పులివెందుల పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం రాయలపురం నుంచి పులివెందుల పట్టణంలోని మార్కెట్ యార్డు, రాజీవ్ కాలనీ, శ్రీ రంగనాథ స్వామి ఆలయం మీదుగా ఈ నిర్మాణాలు చేపడతామని ప్రకటించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఫోర్ రైన్ రోడ్డు ఉన్నదని తిరిగి నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం చేయవలసిన అవసరం లేదని, అదీ కాక పట్టణంలో 26 మీటర్ల వరకే రోడ్డు నిర్మాణాలు చేపట్టవలసి ఉండగా అధికారులు 32 మీటర్ల వరకు భూసేకరణ చేస్తున్నారని వారు వాపోయారు.

సాధారణంగా నేషనల్ హైవే నిర్మాణాలకు సంబంధించి ఊరు వెలుపల 32 మీటర్ల రోడ్డును, ఊరిలో 26 మీటర్ల రోడ్డును నిర్మాణం చేయాలని నిబంధనలు ఉన్నాయని వాటిని అధికారులు తుంగలో తొక్కుతున్నా రని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే కీలకమైన ఈ సమావేశానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఎవరికి కానీ సమాచారం ఇవ్వకపోవడం కొసమెరుపు. సమావేశానికి జాయింట్ కలెక్టర్ వస్తే వినతిపత్రం అందజేస్తామని సిద్ధం చేసుకున్న బాధితులు జాయింట్ కలెక్టర్ రాకపోవడంతో జిల్లా కలెక్టర్ ను కలిసి త్వరలో తమ సమస్యను తెలపనున్నట్లు వారు వెల్లడించారు. అంతేకాక కేంద్రం మంత్రికి, రాష్ట్ర రెవిన్యూ శాఖ , ఆర్ అండ్ బి శాఖ మంత్రులకు, ముఖ్యమంత్రి తదితరులు కూడా వినతి పత్రాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

