తిరుమల,మహి న్యూస్, ఫిబ్రవరి 28:
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.

తెప్పోత్సవాలలో భాగంగా స్వామి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన దశావతారాలు, పాండు రంగడు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల రూపాలతో విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు మెంబర్లు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

