తిరుమల, మహి న్యూస్, మార్చి 01:
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఇదంతా వైసీపీ నేతలు పన్నిన నీచమైన కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం తిరుమలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తన ప్రతిష్టను మరియు టీటీడీ బోర్డు గౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను క్షుణ్ణంగా వివరించారు.
డీప్ ఫేక్ వీడియోల వెనుక కుట్ర
తనపై వస్తున్న వీడియోలు పూర్తిగా డీప్ ఫేక్ మరియు మార్ఫింగ్ అని చైర్మన్ స్పష్టం చేశారు. వీడియోలో ఉన్న వ్యక్తికి, తమ కుటుంబానికి 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రతీకార రాజకీయాలు
గతంలో జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు ప్రతీకారంగానే ఈ బురదజల్లుడు కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. “భారతి గారి పేరు ఎత్తానన్న కోపంతోనే నాపై ఇటువంటి నీచమైన దాడులకు పాల్పడుతున్నారు. 20-25 ఏళ్ల క్రితం నాటి ఫోటోలను మార్ఫింగ్ చేసేందుకు వీరికి సిగ్గులేదా?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇద్దరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
మాజీ చైర్మన్లకు హెచ్చరిక
టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు చుక్కలు చూపిస్తానని బిఆర్ నాయుడు హెచ్చరించారు. గత పాలకుల హయాంలో జరిగిన అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, ఏ ఫైల్ ఓపెన్ చేసినా దొంగ లెక్కలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో వారు చేసిన పనులన్నీ తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని బాగోతాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు
ఎవరో అడిగారని టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఓపికగా ఉన్నానని, ఇకపై తనపై అక్రమంగా పోస్టులు పెట్టే వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని బిఆర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

