తిరుమల, మహి న్యూస్, మార్చి 10 :
తిరుమల శ్రీవారి ఆలయంలోని పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందని ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యం. వాస్తవాలను వక్రీకరించి రాసిన ఈ కథనాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది.
వాస్తవానికి, 2025 జనవరి 11న పరాకామణిలో విధులు నిర్వహిస్తున్న ABREPOSE సంస్థకు చెందిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య అనే వ్యక్తి 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ వ్యక్తి ఆ బంగారు బిస్కెట్‌ను ఖాళీగా ఉన్న స్టీల్ హుండీ ట్రాలీలోని పైపు రంధ్రంలో దాచిపెట్టినట్లు సాధారణ భద్రతా తనిఖీలలో గుర్తించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. దాని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించబడ్డాయి.
ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు Cr.No.02/2025, BNS సెక్షన్ 316(5) కింద నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి 2025 జనవరి 13న నిందితుడిని కోర్టుకు హాజరు పరచగా న్యాయస్థానం అతన్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. నిందితుడు సుమారు 30 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉండడం జరిగింది.
పోలీసు వారి సమాచారం ప్రకారం సీసీటీవీ ఫుటేజీ సహా అన్ని డిజిటల్ ఆధారాలను 65(B) ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ధృవీకరించి కోర్టుకు సమర్పించడం జరిగింది.
పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటి వద్ద మరియు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా ఘటన స్థలంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్, ఇంటి సోదాల్లో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు, పోలీసు కస్టడీలో అదనంగా 76 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ప్రముఖ జ్యువెలరీ దుకాణాల్లో బంగారం మార్పిడి చేసిన ఇన్వాయిస్ రసీదులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా 12 మంది సాక్షులను విచారించి, నిందితుడి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల్లో బంగారం ముట్టజెప్పిన వివరాలు, ఆస్తులు, బినామీ లావాదేవీలు తదితర అంశాలను కూడా పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయబడింది. ప్రస్తుతం ఈ కేసు CC No.309/2025గా న్యాయస్థానంలో విచారణలో ఉంది. తదుపరి విచారణ 2026 ఏప్రిల్ 13న జరగనుంది.
చోరీ మరియు అరెస్టుకు సంబంధించిన సదరు విషయాలను అన్ని ప్రసార మాధ్యమాల్లో (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషియల్ మీడియాలో) నూ కవర్ చేయబడింది.
ఈ సంఘటనలో టీటీడీ విజిలెన్స్ మరియు భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి నిందితుడిని వెంటనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ సంఘటనను వక్రీకరించి పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగినట్లు, కోట్ల విలువైన బంగారం మాయమైందన్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారం. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా భక్తుల్లో అనవసర అపోహలు కలిగించే విధంగా నిరాధార కథనాలు ప్రచురించడం భావ్యం కాదు.
పరాకామణి ప్రక్రియలో బహుళస్థాయి భద్రతా వ్యవస్థ, కఠిన నియంత్రణ విధానాలు, సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉన్నాయని టీటీడీ స్పష్టం చేస్తోంది. కాబట్టి భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

