జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
’
స్వచ్ఛాంధ్రే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఇళ్ల ముంగిటకే స్వచ్ఛ రథాలు
పొడి చెత్తకు విలువ కట్టి 20 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం
తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ
చెత్త కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం
చెత్త తో సంపద సృష్టించిన ఘనత సీఎం చంద్రబాబుదే
జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
స్వచ్ఛ రథాన్ని జెండా ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
కడప జిల్లా చెన్నూరు/కమలాపురం, మహి న్యూస్ ఫిబ్రవరి 07 :
తమ ప్రభుత్వం చెత్త ద్వారా సంపద సృష్టించి ప్రజలకు ఆదాయం మార్గం చూపించామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.


శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ఆర్ కడప జిల్లా ఒక రోజు పర్యటనలో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.
అనంతరం చెన్నూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యంతో ఏపీని పరిశుభ్రంగా ఉంచాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమన్నారు. దేశం లోనే ఏపీని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పమన్నారు. 2014-19లోనే ఏపీలో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు ..2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త నుండి సంపద ను సృష్టించే చర్యల్లో భాగంగా మూలనపడిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకొచ్చారన్నారు. గ్రీన్ అంబాసిడర్ల చేత ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తతో సేంద్రీయ ఎరువులు సేకరించి, రైతులకు విక్రయిస్తూ పంచాయతీలకు ఆదాయం మార్గం చూపారు. పొడి చెత్తను సైతం రీ స్లైక్లింగ్ చేస్తూ ఆదాయ వనరుగా మార్చారు.
పొడి చెత్తకు నిత్యావసర వస్తువులు
గ్రామాల్లో ఇంటింటి నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, ప్యాకెట్లు, గాజు సీసాలు, పాత పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, నూనె డబ్బాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం వంటి పొడి చెత్త సేకరణకు స్వచ్ఛ రథాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని ఇన్చార్జి మంత్రి సవిత వెల్లడించారు. ఈ రథాల ద్వారా పొడి చెత్తను కేజీల రూపంలో తీసుకుని, వాటికి విలువ కట్టి, 20 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేస్తున్నామన్నారు. కేజీ ప్లాస్టిక్ విలువను రూ.20లుగా నిర్ణయించామన్నారు. ఇళ్లలో పనికిరాని పొడి చెత్తకు విలువ కట్టి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామన్నారు. చెత్తకు కూడా విలువ కట్టి, ఆదాయ వనరుగా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. అంతకుముందు స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణా చైతన్యరెడ్డి నడపగా, మంత్రి సవిత పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.సేకరించిన చెత్తకు మంత్రి సవిత నిత్యావసర వస్తువులు అందజేశారు.

అనంతరం చెన్నూరు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో కలియ తిరిగారు. అక్కడ సేంద్రీయ ఎరువు తయారీ విధానాన్ని నిర్వాహాకులను అడిగి తెలుసుకున్నారు.
చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఆవరణలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణా చైతన్య రెడ్డితో కలిసి మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

