అమరావతి మహి న్యూస్ మార్చి 08
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కవయిత్రి మంజుల పత్తిపాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, ప్రతి మహిళ నిజంగా సంతోషంగా ఈ రోజును జరుపుకుంటుందా అనే విషయంపై మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
సమాజంలో చాలా సందర్భాల్లో మహిళకు మహిళే శత్రువుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురైన కష్టాల బాధను మరో సాటి మహిళపై చూపించే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.
సంతోషంగా ఇంటికి అడుగుపెట్టిన మహాలక్ష్మిని వరకట్న దాహంతో బాధపెట్టే మహిళలు కూడా సమాజంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఉన్నా కూడా కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు ఉన్నారని, అత్తలు, ఆడపడుచుల కాళ్లు పట్టి వారు పడుకున్న తర్వాతే నిద్రపోయే మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. నిండు గర్భిణీ అయినా కూడా నీళ్ల బిందెలు మోసిన మహిళల కష్టాలను ఆమె ప్రస్తావించారు.
ఈ పరిస్థితులు మారాలంటే మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా ముందుగా మన ఆలోచనలు మారాలని ఆమె సూచించారు.
తన జీవితంలో కన్నీరు పొంగిన ప్రతి క్షణం తన గుండెల్లో ఒక విప్లవాన్ని మేల్కొలిపిందని, ఆ కన్నీళ్లు రుధిరసిరలుగా మారి కవితల రూపంలో బయటకు వచ్చాయని ఆమె చెప్పారు.
మహిళలకు మగవారు మాత్రమే శత్రువులు కాదని, చాలా సందర్భాల్లో మహిళలు తమకే శత్రువులుగా మారుతున్నారని ఆమె అన్నారు. పిల్లలను సరైన విలువలతో పెంచకపోతే సమాజానికి విషపు నాగులను తయారు చేస్తున్నట్టే అవుతుందని ఆమె హెచ్చరించారు.
మహిళ నిజంగా సంతోషంగా ఉండాలంటే ముందుగా సాటి మహిళ మారాలని, మహిళ మారితే కుటుంబం మారుతుందని, కుటుంబం మారితే సమాజం మారుతుందని, అప్పుడు మగవారు కూడా మారుతారని ఆమె అన్నారు.
అప్పుడు ప్రతి ఇంట్లో… ప్రతి రోజూ… మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అవుతుందని మంజుల పత్తిపాటి పేర్కొన్నారు.

