తెలంగాణ( రంగారెడ్డి జిల్లా) మహి న్యూస్, ఫిబ్రవరి 07:
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు, పటాన్‌చేరు ఇన్‌చార్జ్ యడమ రాజేష్, సీనియర్ నాయకులు సైదాల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అడక్ కమిటీ సభ్యులు పవన్, జైరాం,రాష్ట్ర విద్యార్థి నాయకులు సూర్య, వంశీ ప్రసాద్, సునీంద్రబాబు, గబ్బర్ సింగ్ టీమ్‌తో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జనసేనపై తమ విశ్వాసాన్ని చాటారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ –“తాండూర్ ప్రజల సమస్యలు నిజాయితీగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చే నాయకత్వమే ఇప్పటి అవసరం. మురుగు కాల్వలు, తాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి, నిరుద్యోగ యువత భవిష్యత్తు – ఇవన్నీ ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చే విషయాలుగా కాకుండా, నిత్యం పట్టించుకునే మనస్తత్వం కావాలి. జనసేన పార్టీ అధికారానికి కాదు – ప్రజాసేవకు పుట్టింది. పదవికి కాదు – బాధ్యతకు నిలిచింది. ఈ ఎన్నికలు ఒక పార్టీ గెలుపు-ఓటమి కోసం మాత్రమే కాదు తాండూర్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే నిర్ణయం కోసం. మీ ఓటు మీ వీధి రోడ్డును నిర్ణయిస్తుంది, మీ ఓటు మీ ఇంటికి వచ్చే నీటిని నిర్ణయిస్తుంది, మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

ఈరోజు మనం ప్రచారంలో ఉన్నాం రేపు ప్రజల సమస్యల మధ్యలో ఉండాలి. జనసేన అభ్యర్థులు గెలిస్తే వార్డు ఆఫీస్‌కి కాదు, ప్రజల ఇంటికే ముందుగా వెళ్తారు. అనంతరం ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో విజయం ఒక్క అభ్యర్థి వల్ల కాదు ప్రతి కార్యకర్త చెమట వల్ల సాధ్యమవుతుంది. గల్లీ గల్లీకి జనసేన స్వరం వినిపించాలి.ప్రతి ఇంటికి జనసేన ఆలోచన చేరాలి. మీ అందరి కృషి కలిసినప్పుడే విజయం మనదవుతుంది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పని చేయాలి. అలాగే యువతను ఉద్దేశించి ఈ మార్పు మీ చేతుల్లోనే ఉంది. రాజకీయాల్లో శుభ్రత కావాలంటే – యువత ముందుకు రావాలి. తాండూర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చే శక్తి మీలో ఉంది. చివరగా ఓటు అమ్ముకోకండి మీ భవిష్యత్తును అమ్ముకోకండి. నిజాయితీకి ఓటేయండి, సేవకు ఓటేయండి,జనసేనకు ఓటేయండి అని పిలుపునిచ్చారు.


