నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:-
జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీర్లు, సోలార్ వెండర్లతో కలిసి వివిధ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పీఎం-కుసుమ్-సి పథకం కింద జిల్లాలో చేపట్టిన 9 పనులలో 4 పనులకు ఇప్పటికే స్థలాలు ఖరారు చేసామని మిగిలిన పనులకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరారైన 4 పనులకు తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు పగటి పూట నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 117 ఎకరాల విస్తీర్ణంలో 29 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ‘వృద్ధి ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA) జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13,595 వ్యవసాయ పంప్‌సెట్లకు నిరంతర సౌర విద్యుత్ సరఫరా కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పీఎం సూర్యఘర్ & రూఫ్‌టాప్ సోలార్
PM Surya Ghar Muft Bijli Yojana మరియు రూఫ్‌టాప్ సోలార్ (RTS) ప్లాంట్ల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. CAPEX విధానం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కేటాయించిన రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేయాలని వెండర్లను ఆదేశించారు. ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏపీఎస్‌పీడీసీఎల్ సిబ్బంది, సోలార్ వెండర్లు సంయుక్తంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణ సౌకర్యాల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసి రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్టుల సమర్థ అమలుతో రైతులు, గృహ వినియోగదారులు తక్కువ ఖర్చుతో పునరుత్పాదక శక్తి ఆధారిత నాణ్యమైన విద్యుత్‌ను పొందగలరని కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు శాశ్వత విద్యుత్ పరిష్కారాల దిశగా జిల్లా ముందంజలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

