నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:-
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ, నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి, మునిసిపల్ కమిషనర్లు, రోడ్లు మరియు భవనాలు శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజుల్లో ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించబడుతుందని కలెక్టర్ తెలిపారు. పోలీసుల ధృవీకరణ అనంతరం సాధారణ గాయాల కేసుల్లో 24 గంటల పాటు, తీవ్ర గాయాల కేసుల్లో 48 గంటల పాటు స్థిరీకరణ వైద్య సేవలు అందించబడతాయని వివరించారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు చెల్లింపులు మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా చేయబడతాయి. ప్రమాదానికి కారణమైన వాహనం బీమా చేయబడినట్లయితే బీమా సంస్థలు వ్యయాన్ని భరిస్తాయి. బీమా చేయని వాహనాల సందర్భంలో, భారత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చును భరిస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజలకు అత్యంత ప్రయోజనకరమని, రోడ్డు ప్రమాదాల అనంతరం బాధితులకు ఆలస్యం లేకుండా వైద్య సహాయం అందించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పథకం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

