ప్రజా సానుకూల దృక్పథం పెరిగేలా పని చేయాలి-జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, మహి న్యూస్, ఆగస్టు 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీపీపీ డేటా ఆధారంగా కలెక్టర్ గంటకు పైగా లోతుగా సమీక్ష నిర్వహించారు. గ్రామీణ తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, అంగన్వాడి, సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై ప్రజాభిప్రాయ గణాంకాలను శాఖల వారీగా క్షుణ్ణంగా విశ్లేషించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) పనితీరుపై గణాంకాలతో సమీక్ష నిర్వహించగా, 88 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. క్షేత్రస్థాయి విచారణలో నాణ్యత పెంచడం ద్వారా ఈ ప్రజా సంతృప్తి స్థాయిని 95 శాతానికి పెంపొందించాలని కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. వినతిపత్రాల పరిష్కారంలో జాప్యం జరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని, అందుకే గడువు దాటిన అర్జీల సంఖ్యను సున్నాకి తగ్గించి, 100 శాతం వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఆగస్టు మాసానికి జిల్లా స్కోరు 52.70 శాతంగా నమోదైందని, అలాగే వీధిదీపాల నిర్వహణలో 64.63 శాతం సానుకూలత ఉందన్నారు. కొన్ని మండలాల్లో ప్రజాభిప్రాయం తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 3 నుంచి 6 ఏళ్ల పిల్లల విభాగంలో 72.66 శాతం, 6 నుంచి 36 నెలల పిల్లల విభాగంలో 80.58 శాతం సానుకూల దృక్పథం వ్యక్తమైందని, అంగన్‌వాడీ సేవల నాణ్యతను మరింత పెంచాలని స్పష్టం చేశారు.
బిసి సంక్షేమ హాస్టళ్లలో ఆగస్టు స్కోరు 70.55 శాతం, బిసి రెసిడెన్షియల్ పాఠశాలల్లో 77.01 శాతం సానుకూల స్పందన లభించిందన్నారు. అలాగే సోషల్ వెల్ఫేర్, హాస్టళ్లలో 77.38 శాతం, ఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 71.63 శాతం పీపీపీ నమోదైనట్లు వివరించారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 70.78 శాతం, టిడబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 67.93 శాతం సానుకూలత ఉందన్నారు. కొన్ని మండలాల్లో పీపీపీ స్కోరు తక్కువగా ఉండటంపై స్పందిస్తూ.. ప్రతి హాస్టల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, డిఆర్‌ఓ విశ్వేశ్వరరావు, సీపీవో, జెడ్పీ సీఈఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు