అనంతపురం మహి న్యూస్ ఫిబ్రవరి 08
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరియు చేనేత పరిశ్రమ మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధం కాదు. అది చేనేత కళాకారుల జీవనంతో ముడిపడిన చారిత్రక బంధం. ఈ నిజం నేటి తరం ప్రజలకు, ముఖ్యంగా యువతకు పూర్తిగా తెలియకపోవడం దురదృష్టకరం.
1992లో రాజకీయంగా ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు, పరిస్థితులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్ర చేనేత సహకార సంఘ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో, 23 జిల్లాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులే డైరెక్టర్లుగా గెలిచి, చేనేత చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేశారు.
ఆప్కో చైర్మన్ పదవికి వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాకు చెందిన బండి హనుమంతును ప్రతిపాదించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తిరస్కరించి, అదిలాబాద్‌కు చెందిన నాగయ్య పేరును ముందుకు తెచ్చారు. ఈ పరిణామాన్ని సవాలుగా తీసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, చేనేత ఉద్యమానికి పునాదులైన ప్రగడ కోటయ్యతో కలిసి ఎన్నికైన డైరెక్టర్లను ఒక్కొక్కరిగా కలసి ఒప్పించి, ప్రజాస్వామ్య పద్ధతిలో బండి హనుమంతును ఆప్కో చైర్మన్‌గా ఎన్నిక చేయించారు. ఇది చేనేత రంగంలో రాజకీయ జోక్యాన్ని ఎదుర్కొని సాధించిన అపూర్వ విజయంగా నిలిచింది.
ఆ సంఘటన తరువాత నుంచి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను సంప్రదిస్తూ ఉండేవారు. విధానపరమైన నిర్ణయాల నుంచి క్షేత్రస్థాయి సమస్యల వరకు ఆయనకు చేనేతపై ఉన్న అవగాహన, బాధ్యత స్పష్టంగా కనిపించేది.
1995లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఆప్కో సంస్థ తీవ్రంగా బలహీనపడింది. దేశవ్యాప్తంగా ఉన్న 320 ఆప్కో షాపుల్లో 140 షాపులు మూసివేయబడ్డాయి. విక్రయాలు సగానికి పైగా పడిపోయాయి. ఫలితంగా వేలాది చేనేత కళాకారులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తూ నేను మా కౌన్సిల్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజ్యాంగ సంస్థలకు, న్యాయవ్యవస్థలకు మూడు వేలకుపైగా వినతులు సమర్పించాను. ఈ పోరాటం రెండు తెలుగు రాష్ట్రాల చేనేత కళాకారులు, బీసీ వర్గ ప్రజలకు తెలిసిన విషయమే.
ఈ అన్యాయానికి ప్రతిస్పందనగా 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 1.80 కోట్ల చేనేత సమాజం ఏకమై వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇది కేవలం రాజకీయ విజయం కాదు — చేనేత సమాజం తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు చేసిన ప్రజాస్వామ్య నిర్ణయం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి పతనమైన చేనేత పరిశ్రమను పునరుద్ధరించేందుకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టారు. ఆప్కో సంస్థను సుమారు 50 శాతం వరకు పునర్నిర్మించి, వృత్తిని కోల్పోయిన కళాకారులకు తిరిగి ఉపాధి కల్పించారు. చేనేత సహకార సంఘాలపై ఉన్న సుమారు 320 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసి, పరిశ్రమకు ఆర్థిక భరోసా ఇచ్చారు. ఈ చర్యలు చేనేత చరిత్రలో మైలురాయిగా నిలిచాయి.
2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత స్వల్పకాలంలోనే ఆయన అకాల మరణం చెందడం చేనేత పరిశ్రమకు తీరని లోటుగా మారింది.
ఇటీవల వైఎస్ రాజశేఖరరెడ్డితో నాకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కుమార్తె వైఎస్ షర్మిలను కలసి, తండ్రి చూపిన దారిలో నడిచి, ఒక కోటి జనాభా కలిగిన చేనేత సమాజం మరియు సుమారు 30 లక్షల చేనేత కళాకారుల వృత్తి ఉపాధిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరాను.
చేనేత కళాకారుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత పాలకులు, గత 19 నెలలుగా చేనేత పరిశ్రమను విస్మరిస్తున్న పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకురావడమే కాక, చేనేత పరిశ్రమకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను నేటి తరానికి గుర్తు చేయడమే ఈ ప్రత్యేక ప్రకటన యొక్క ఉద్దేశ్యం.
– ఏవి రమణ
రిటైర్డ్ డీఎంఓ, ఆప్కో
ప్రెసిడెంట్
నేషనల్ హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్

