అమరావతి, మహి న్యూస్ అక్టోబర్ 19:
మైదుకూరు మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో నామినేషన్ పత్రాలు చినిగిపోవడం, నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కడప జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలపై సంబంధిత జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులతో వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
--------///---------
స.పౌ.సం. శాఖ, వైఎస్సార్ కడప జిల్లా.
Be the first to share your thoughts on this story!