ఓజిలి, సెప్టెంబర్ 8, మహి న్యూస్: తిరుపతి జిల్లా ఓజిలి మండలం తిరుమలపూడి చెరువు అభివృద్ధి పనుల పేరిట భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. చెరువు కట్ట బలోపేతం, పూడికతీత, మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులను కేవలం పైపైన పూర్తి చేసినట్లు చూపించి బిల్లులు డ్రా చేశారని అంటున్నారు. చెరువు కట్ట బలోపేతం పేరుతో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా విస్మరించబడ్డాయని, స్వల్ప వర్షాలకే కట్ట దెబ్బతినే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం, ఇరిగేషన్ శాఖకు చెందిన కొందరు అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. పనులు పూర్తిస్థాయిలో జరగకుండానే కొలతలు నమోదు చేసి బిల్లులు మంజూరు చేశారని, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే నిధుల విడుదల జరగడం వెనుక పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా రాజకీయ అండదండలతోనే సాగిందని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే అవినీతికి అడ్డాగా మారితే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని వారు ప్రశ్నిస్తున్నారు.
లెక్కలు తెల్చపోతే ఫిర్యాదులు చేస్తాం.
ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ చెరువు పనులపై వెంటనే సాంకేతిక నిపుణులతో కూడిన స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పనుల అంచనాలు, వ్యయ వివరాలు, కొలతల పుస్తకాలు, బిల్లుల వివరాలను బహిరంగ పరచాలని కోరుతున్నారు. విచారణలో అక్రమాలు రుజువైతే సంబంధిత ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి నష్టపరిహారం వసూలు చేయాలని అంటున్నారు. గ్రామస్తులు హెచ్చరిస్తూ, ప్రజాధన దోపిడీపై అధికారులు స్పందించకపోతే తామే ఫిర్యాదుదారులుగా మారుతామని ప్రకటించారు.
0 Comments