నంద్యాల జిల్లా/ నందికొట్కూరు మహి న్యూస్, సెప్టెంబర్ 12:
నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కొలనుభారతి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నందికొట్కూరు శాసనసభ్యుడు గిత్తా జయసూర్య తెలిపారు. శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకున్న కొలనుభారతి క్షేత్రంలో శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆలయ అభివృద్ధికి అవసరమైన వనరులు, ఆలయ ఆదాయం పెంపు, దాతల సహకారం, భక్తులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. శ్రీశైల దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకోవడంతో క్షేత్రానికి మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా, సజావుగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అటవీ ప్రాంతంలో ఆలయం ఉన్నందున అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు విద్యుద్దీకరణకు సహకరించాలని అటవీశాఖ అధికారులను కోరారు.
సరస్వతీ అమ్మవారి ఆలయంలో వేదపండితులతో వైదిక పద్ధతిలో కైంకర్యాలు నిర్వహించడం తన చిరకాల వాంఛ అని గిత్తా జయసూర్య తెలిపారు. ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల సంఖ్యను నమోదు చేయాలని, కొలనుభారతి ఆలయం అందరిదని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో దశలవారీగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. వేదపండితులు, అర్చకుల కోసం ఆలయ ప్రాంగణంలో శాశ్వతంగా రెండు గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భక్తులకు మరిన్ని సౌకర్యాలు
శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయంలో సమయపాలన అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, నిర్ణీత సమయాల్లో ఆలయ సేవలను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, ఆర్జిత సేవలకు నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పారు.
భక్తుల కోసం రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అక్షరాభ్యాస మండపాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుద్దీకరణను మెరుగుపరుస్తామని చెప్పారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు విధుల సమయంలో సంప్రదాయ వస్త్రాలు ధరించాలని సూచించారు.
ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తామని, వారంలో రెండు రోజులు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. క్షేత్రానికి వచ్చే ప్రముఖుల అభిప్రాయాలను ప్రత్యేక రిజిస్టరులో నమోదు చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
భక్తులు సమర్పించే కానుకలను క్రమం తప్పకుండా ఆలయ ఖాతాలో జమ చేస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న ఆలయ మండప పనులను కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. శివపురం గ్రామం సమీపంలో ముఖద్వారం నిర్మాణానికి చర్యలు చేపడతామని, అమ్మవారి ఆలయంలో శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అనుబంధ ఆలయాల్లోనూ శాశ్వత క్యూలైన్లు, శాశ్వత మరుగుదొడ్లు, నీటి నిల్వ ట్యాంకు, మంచినీటి సరఫరా కోసం బోరుబావి ఏర్పాటు వంటి పనులు చేపడతామని ఈఓ వివరించారు. క్షేత్రమంతటా అమ్మవారి దివ్యనామం వినిపించేలా ధ్వని వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఉత్సవాల సమయంలో అవసరమైన అత్యున్నత నాణ్యత గల ధ్వని వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఈ ప్రతిపాదనలన్నింటినీ దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశాలుగా ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఆలయ ఖాతాలోని స్థిర నిక్షేపాలు, మిగిలిన నిల్వ ధనం యథాతథంగా ఉన్నాయని, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను కూడా శ్రీశైల దేవస్థానమే చెల్లిస్తోందని వెల్లడించారు.
కొలనుభారతి విశిష్ట క్షేత్రం
సమావేశానికి హాజరైన కాకనూరు స్వామి శ్రీశ్రీశ్రీ శివ యోగేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ కొలనుభారతి అత్యంత విశిష్టమైన క్షేత్రమని అన్నారు. ఇక్కడ సప్తఋషులు తపస్సు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవకులేనని పేర్కొన్నారు.
ఆలయంలో సమయపాలన పాటించాలని, తాత్కాలిక ఏర్పాట్లకు బదులుగా శాశ్వత ప్రాతిపదికన భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయానికి కుంభాభిషేకం నిర్వహించడంతో పాటు వైదిక ధర్మం ప్రకారం కైంకర్యాలు జరిపించాలని కోరారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు చిట్టిబొట్ల భరద్వాజశర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. దేవస్థానం దత్తత తీసుకున్న కొద్దికాలంలోనే వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. శివపురం గ్రామ ప్రజలందరూ కలసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
మరో ధర్మకర్తల మండలి సభ్యుడు మేడా మురళీధర్ మాట్లాడుతూ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు కొలనుభారతి ఆలయాన్ని సందర్శించేలా క్షేత్ర విశిష్టతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అటవీశాఖ అధికారి స్వరూప్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనల మేరకు కొలనుభారతి ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
సమావేశంలో శ్రీశైల దేవస్థానం అధికారులు, కొత్తపల్లి తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉప ఇంజనీర్, అటవీశాఖ అధికారులు, గ్రామపెద్దలు ఎర్రం చంద్రశేఖర్, లింగస్వామి గౌడ్, స్థానిక ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments