తాళ్లరేవు, మహి న్యూస్, సెప్టెంబర్ 23: మండలవ్యాప్తంగా నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అన్నసమారాధనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగిన వినాయక ఉత్సవాలకు బుధవారం నిమజ్జన కార్యక్రమాలతో ముగింపు పలికారు. చివరి రోజు ఆయా మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం నుంచే మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక అలంకరణలతో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి విగ్రహాలను నిమజ్జనానికి తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. మేళతాళాలు, డప్పుల వాయిద్యాలు, భక్తుల నినాదాలు, బాణాసంచా కాల్పులతో నిమజ్జన శోభాయాత్రలు ఉత్సాహభరితంగా సాగాయి.
రూ.1.20 లక్షలకు లడ్డూ వేలం.
సుంకరపాలెం బైపాస్ జంక్షన్‌లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నిర్వహించిన లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన భారీ లడ్డూను వేలం వేయగా పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు జంక్షన్‌లోని అల్లవరం వారి శివ దుర్గ స్వీట్ స్టాల్ అధినేత బండిగుప్తాపు హేమంత్ రూ.1,20,000లకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
లడ్డూ వేలం సందర్భంగా భక్తులు, నిర్వాహకులు, వ్యాపారులు ఆసక్తిగా పాల్గొన్నారు. వేలం మొత్తం ముగిసిన అనంతరం నిర్వాహకులు హేమంత్‌ను అభినందించారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలంలో దక్కించుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
కరెన్సీ దండలకు కూడా పోటీ.
అదేవిధంగా గణనాథుడికి అలంకరించిన కరెన్సీ దండలకు కూడా వేలం నిర్వహించారు. కరెన్సీ దండలను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. ఇందులో ఒక కరెన్సీ దండను పైడికొండల సతీష్ రూ.21,100లకు దక్కించుకోగా, మరో కరెన్సీ దండను సుధీర్ రూ.10,000లకు వేలంలో దక్కించుకున్నారు. ఈ వేలం కార్యక్రమం మండపం వద్ద ఉత్సాహాన్ని నింపింది.
ఘనంగా నిమజ్జన కార్యక్రమం
వేలం కార్యక్రమాల అనంతరం గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వాహనాలపై గణపతి విగ్రహాలను ఉంచి భక్తులు శోభాయాత్రగా తరలించారు. యువత డప్పుల మోతకు నృత్యాలు చేస్తూ, జై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు సైతం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల మీదుగా సాగిన గణపతి శోభాయాత్రలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం సమీపంలోని కాలువలు, నదుల్లో భక్తిశ్రద్ధలతో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జన సమయంలో భక్తులు గణనాథుడిని స్మరించుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. తొమ్మిది రోజుల పాటు భక్తులతో కళకళలాడిన గణపతి మండపాలు నిమజ్జనంతో ఖాళీ అయ్యాయి. ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, దాతలు, వ్యాపారులు, యువతకు ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు