తాళ్లరేవు, మహి న్యూస్, సెప్టెంబర్ 26:
మండల పరిధిలోని సుంకరపాలెం పితాని వారి పాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద నిర్వహించిన శ్రీ బాలగణపతి 3వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ముందుగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డూ వేలంపాట చేపట్టారు. ఈ వేలంపాటలో పితాని పెద్ద సాహెబ్ రూ.17,000, సంఘడాల వీరమ్మ రూ.8,000, పితాని వారి పేట మహిళా సంఘం బృందం రూ.10,000 చొప్పున లడ్డూలను దక్కించుకున్నారు.
అనంతరం గణపతి స్వామివారి విగ్రహాన్ని గ్రామంలో ఉత్సాహంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, బుర్రగేదెల ప్రదర్శనలు, స్థానిక మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి నామస్మరణతో నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!