మీ ఖాళీ స్థలం.. ఐటీ కంపెనీలకు చిరునామా కావచ్చు..!
* *పారిశ్రామికంగా దూసుకెళ్తున్న కడపకు మరో సువర్ణావకాశం*
* *ఆదాయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి*
* *జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపు*
కడప, మహి న్యూస్ జూలై 18: రాష్ట్రంలో ఐటీ రంగాన్ని వేగంగా విస్తరించడంతో పాటు జిల్లాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ మౌలిక వసతుల ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
వైఎస్ఆర్ కడప జిల్లా శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన https://itinfra.ap.gov.in/#/home/landing పోర్టల్ జిల్లా ప్రజలకు మరింత ప్రయోజనకరంగా చక్కటి ఉపాధి, ఆదాయ రంగాల పైపు నడిపించే మార్గదర్శి మారనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్కు అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతోందని, భారీ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు వేలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
* *కడప జిల్లా ప్రజలకు సువర్ణావకాశం ఎందుకంటే..?*
సిమెంట్ పరిశ్రమలకు కడప ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, అదే సమయంలో సౌర విద్యుత్, వస్త్ర పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. వేలాది ఎకరాల్లో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతుండటంతో జిల్లా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోంది.
అదేవిధంగా రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చెందుతున్న కోపర్తి ఎలక్ట్రానిక్ తయారీ సముదాయం దశలవారీగా విస్తరిస్తూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో కొపర్తి కేంద్రంగా మరిన్ని జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలు జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీయల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ను అధిగమించి సరిపడా స్థలాలు, భవనాలు అవసరం అవుతుంది.
మరోవైపు జిల్లాను అన్ని పెద్ద నగరాలకు అనుసంధానం చేసే జాతీయ రహదారులు విస్తరించాయి. పారిశ్రామిక అవసరాలకు అవసరమైన రవాణా వ్యవస్థ జిల్లాకు ఉంది. జాతీయ స్థాయి కనెక్టివిటీలో రైల్వే, విమానయాన సర్వీసులు జిల్లా ప్రజలకు చక్కటి అవకాశాలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ మౌలిక వసతుల పోర్టల్ జిల్లా ప్రజలకు అరుదైన అవకాశంగా నిలువనుంది. పెద్ద పెద్ద భవనాల యజమానులే కాకుండా చిన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ అంతస్తులు, ఖాళీ భూములు కలిగిన వారంతా తమ ఆస్తులను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు, గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు), ఇతర సాంకేతిక సంస్థలకు లీజుకు ఇవ్వడం లేదా విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
--- డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా కలెక్టర్, వైఎస్ఆర్ కడప జిల్లా.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన https://itinfra.ap.gov.in/#/home/landing పోర్టల్‌లో ఆస్తుల వివరాలను నమోదు చేస్తే అవి నేరుగా పెట్టుబడిదారుల దృష్టికి చేరుతాయని, నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై సమగ్ర సమాచారం పెట్టుబడిదారులకు చేరి కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు జిల్లాకు రావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఐటీ సంస్థల రాకతో స్థానిక యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రవాణా, గృహవసతి, హోటళ్లు, వ్యాపార సేవలు, విద్య, ఇతర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ వివరించారు. తద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కడపను రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ పోర్టల్ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అందువల్ల చిన్న, పెద్ద వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు లేదా ఖాళీ భూములు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐటీ మౌలిక వసతుల పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాల కోసం *జిల్లా ఐటీ మేనేజర్ (90108 21844)* ను సంప్రదించవచ్చని తెలిపారు.
0 Comments