యాదాద్రి, జూలై 23 (మహి న్యూస్): యాదాద్రి కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, పునర్వినియోగ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పవిత్ర యాదాద్రి దేవాలయాన్ని పరిశుభ్రంగా భావితరాలకు అందించాలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ బ్రాహ్మణ సేవా వాహిని (బీఎస్‌వీ) యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “దేవాలయ పరిరక్షణే పరమ పూజ” అనే భావనను ప్రతి భక్తుడు గ్రహించాలని కోరారు. స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా, దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా ప్రతి భక్తుడి బాధ్యత అని పేర్కొన్నారు.
యాదాద్రి కొండపైకి ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వస్తువులను తీసుకురాకుండా భక్తులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, యాదాద్రి కొండపై కూడా ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేయాలని దేవస్థాన కమిటీని పత్రికా విలేకరుల ద్వారా ఆమె కోరారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు పవిత్ర క్షేత్రం పరిశుభ్రతను కాపాడేందుకు భక్తులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు.
0 Comments