Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఆహార వృథాకు చెక్… మెగా ఫుడ్ పార్కులు

Share this Article:

డా. ముచ్చుకోట సురేష్‌బాబు

సెల్: 9989988912

భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. పెరుగుతున్న జనాభా, వినియోగదారుల కొనుగోలు శక్తి, విస్తరిస్తున్న ఆహార మార్కెట్ కారణంగా దేశం ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. పాలు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో తొలి స్థానంలో ఉండగా, పండ్లు, కూరగాయలు, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ, ఈ అపారమైన వ్యవసాయ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇంకా వెనుకబడి ఉంది.

దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ, ఉద్యాన పంటల్లో గణనీయమైన భాగం ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత, శీతల గిడ్డంగుల లేమి, రవాణా లోపాలు, ఆధునిక సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల వృథా అవుతోంది. అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 25 నుంచి 30 శాతం వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు చేరక ముందే పాడైపోతున్నాయి. దేశంలో పండే ఆహార ఉత్పత్తుల్లో కేవలం 7 శాతం మాత్రమే ప్రాసెసింగ్ అవుతుండగా, అమెరికాలో ఇది 65 శాతం, ఫిలిప్పీన్స్‌లో 78 శాతం, చైనాలో 23 శాతంగా ఉంది. ఈ వ్యత్యాసం భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలోని లోటుపాట్లను స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం అత్యవసరం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం 2008లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ పథకాన్ని ప్రారంభించింది. రైతు నుంచి వినియోగదారుడి వరకు మొత్తం విలువ గొలుసును ఒకే వేదికపైకి తీసుకురావడం, ఆహార వృథాను తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.

మెగా ఫుడ్ పార్కులు “ఫార్మ్ టు మార్కెట్” విధానంలో పనిచేస్తాయి. పొలం వద్ద నుంచే పంట సేకరణ, ప్రాథమిక ప్రాసెసింగ్, శీతల నిల్వ, రవాణా, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. దీంతో రైతుకు పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు పంట నష్టాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.

మెగా ఫుడ్ పార్క్‌లలో మూడు ప్రధాన విభాగాలు

● సేకరణ కేంద్రాలు:
గ్రామ స్థాయిలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), స్వయం సహాయక సంఘాల నుంచి పంటను సేకరిస్తాయి. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు సేవలందిస్తూ గ్రామీణ వాణిజ్య కేంద్రాలుగా పనిచేస్తాయి.

● ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు:
పంటను శుభ్రపరచడం, గ్రేడింగ్, పల్పింగ్, జ్యూసింగ్, ప్యాకింగ్ వంటి ప్రాథమిక ప్రక్రియలు నిర్వహిస్తారు. అవసరమైతే శీతల నిల్వలు, శీతలీకరణ వాహనాల ద్వారా ఉత్పత్తులను సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలిస్తారు.

● సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్:
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక కేంద్రంలో పెద్ద, మధ్య, చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఒకేచోట పనిచేస్తాయి. నీరు, విద్యుత్, మురుగునీటి శుద్ధి, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు, నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో మెగా ఫుడ్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలోని 70 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే వ్యవసాయ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వాటా క్రమంగా తగ్గుతోంది. రైతుల ఆదాయం పెరగాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం సరిపోదు. ఉత్పత్తికి విలువ జోడించే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలి.

రాబోయే దశాబ్దంలో భారత ఆహార ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో భారత్ వాటా ఇప్పటికీ 1.5 శాతం కంటే తక్కువగానే ఉంది. ప్రాసెసింగ్, నిల్వ సౌకర్యాల కొరత కారణంగా ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ నష్టాన్ని తగ్గించాలంటే దేశవ్యాప్తంగా మరిన్ని మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడం అత్యవసరం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయలు, మామిడి, టమాటా, మిర్చి, పాల ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులకు అనుగుణంగా ప్రత్యేక ఫుడ్ పార్కులను అభివృద్ధి చేయాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెసింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ఆహార వృథాను అరికట్టడం అంటే కేవలం ఆర్థిక నష్టాన్ని తగ్గించడం మాత్రమే కాదు. అది రైతు శ్రమకు గౌరవం ఇవ్వడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం, గ్రామీణ ఉపాధిని పెంచడం, దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడం కూడా. ఈ లక్ష్యాలను సాధించడంలో మెగా ఫుడ్ పార్కులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సులభ రుణాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.

రైతు నుంచి వినియోగదారుడి వరకు ప్రతి దశలో విలువను సృష్టించే మెగా ఫుడ్ పార్కులే భారత వ్యవసాయ భవిష్యత్తుకు బలమైన పునాది.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/37

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X