ప్రొద్దుటూరు, జూలై 26 (మహి న్యూస్): తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు కాజేసిన నిందితుడిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభూ కృష్ణా, ఐపీఎస్ వెల్లడించారు.
ప్రొద్దుటూరుకు చెందిన రవికుమార్‌కు లక్ష రూపాయలకే 100 గ్రాముల బంగారం తయారు చేసి ఇస్తానని మాయమాటలు చెప్పిన కన్నయ్య అలియాస్ ప్రసాద్ అనే వ్యక్తి, నకిలీ బంగారు కడ్డీ ఇచ్చి మొత్తం రూ.6.50 లక్షలు తీసుకుని పరారైనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా వాసవి సర్కిల్ సమీపంలో నిందితుడు కన్నయ్య అలియాస్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజలకు సూచన: తక్కువ ధరకే బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్పీ విభూ కృష్ణా సూచించారు.
0 Comments