Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

కొబ్బరి పీచుతో కోనసీమకు కొత్త పారిశ్రామిక దిశ

Share this Article:

అమలాపురం, జూలై 15 (మహీన్యూస్):

కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జూలై 16, 17 తేదీల్లో అనాతవరం వేదిక ఫంక్షన్ హాల్‌లో కోనసీమ కోయిర్ కాంక్లేవ్–2026 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాంక్లేవ్‌లో రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్‌లో కేరళకు చెందిన కోయిర్ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని కొబ్బరి పీచుతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఆధునిక సాంకేతికత, పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కోయిర్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎంఎస్‌ఎంఈ, ముద్రా, పీఎంఈజీపీ తదితర పథకాల కింద లభించే సబ్సిడీలు, బ్యాంకు రుణాలపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు తెలియజేస్తారు. రుణ సదుపాయాల కోసం బ్యాంకుల ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా కోయిర్ బోర్డు, ఉద్యానవన, మార్కెటింగ్, పరిశ్రమల శాఖలు, ఏపీఐఐసీ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, అనుమతుల ప్రక్రియపై మార్గనిర్దేశం చేయనున్నాయి. కొబ్బరి పీచుతో తయారు చేసే వివిధ విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు.

కోనసీమలో సమృద్ధిగా లభించే కొబ్బరి పీచును సద్వినియోగం చేసి స్థానిక యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కొత్త సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ కాంక్లేవ్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కోయిర్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్, ఎగుమతి అవకాశాలు, వ్యాపార విస్తరణకు అనుసరించాల్సిన విధానాలపై కూడా ఔత్సాహికులకు సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కొబ్బరి సాగు రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోనసీమను కోయిర్ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.g…

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/6

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X