తాళ్లరేవు, మహి న్యూస్, ఆగస్టు 26: కాకినాడ జిల్లా కోరింగ అభయారణ్యాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ట్రైనీలు బుధవారం సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా చొల్లంగిలోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం (సీబీఈటీ) కేంద్రాన్ని సందర్శించి, అక్కడి పర్యావరణ పరిరక్షణ, మడ అడవుల సంరక్షణకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఎఫ్‌బీఓ కె. మహేష్‌లు మడ అడవుల విశిష్టత, వన్యప్రాణుల సంరక్షణ, సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యత తదితర అంశాలను ట్రైనీలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో మడ అడవుల పాత్ర, జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ చి. మంజుక్, ఎఫ్‌ఎస్‌ఓ ఎస్. వీరభద్రరావు, సీహెచ్. ధనలక్ష్మి, పి. సంధ్యారాణి, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments